సాక్షర, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సహనంతో, గాంధీజీ అహింస సిద్ధాంతంతో సమ్మెను కొనసాగిస్తున్నారని, సీఎం కేసీఆర్ చేసే భయానక ప్రకటనలు వారిపై కించిత్తు ప్రభావం కూడా చూపడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు చెబుతున్నా, ప్రజాసంఘాలు సూచిస్తున్నా సీఎం ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నారని, పిచ్చి ప్రేలాపణలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ వచ్చాక కూడా ఆత్మహత్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేసీఆర్ హైకోర్టునే ధిక్కరించే విధంగా మాట్లాడుతున్నారని, కోర్టులో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం లక్ష్మణ్ సమక్షంలో మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారు.