డిసెంబర్‌లో అధికారిక ప్రకటన: కేటీఆర్
సాక్షర న్యూఢిల్లీ: తెలంగాణలో శానిటేషన్ హబ్ నెలకొల్పనున్నామని, దేశవ్యాప్తంగా, దక్షిణాసియాలోనూ పారిశుద్ధ్య నిర్వహణలో సేవలందించేలా ప్రణాళిక రూపొందించామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి నివేదించారు. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలసి ఈ అంశమై చర్చించారు. తాము హైదరాబాద్‌లో నెలకొల్పబోయే 'అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో ఇది ఒక భాగంగా ఉంటుందని వివరించారు.
అత్యంత నివాస యోగ్యమైన నగరాలున్న ప్రాంతంగా నిలవడమే లక్ష్యంగా తెలంగాణ ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో వృద్ధి సాధిస్తోంది. తెలంగాణ, అలాగే దేశంలోని ఇతర ప్రాంతాలు, దక్షిణాసియా దేశాలకు పారిశుద్ధ్య సేవలు అందించేలా ఒక దీపస్తంభం వంటి శానిటేషన్ హబ్ నెలకొల్పేందుకు చక్కటి అవకాశముంది. ఇది ఆవిష్కరణల సృష్టికి కేంద్రంగా కూడా పనిచేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి హబ్‌ను నెలకొల్పేందుకు ఆసక్తితో ఉంది. అడ్మిని్రస్టేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ఇందుకోసం అత్యున్నత స్థాయి బ్లూప్రింట్ రూపొందించింది.
పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తగిన నిధులు కేటాయిస్తుంది. వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం కూడా చూస్తున్నాం..'అని తెలిపారు. 'ఈ హబ్ కోసం కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ నుంచి ప్రారంభ మూలధనంగా రూ.1,00 కోట్లు ఇచ్చి సాయపడాలి..'అని కేటీఆర్ అభ్యరి్థంచారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్థలాన్ని గుర్తించిందని, వనరుల మద్దతు అందిస్తోందని తెలిపారు. డిసెంబర్‌లో ఈ శానిటేషన్ ఇన్నోవేషన్ హబ్‌పై అధికారిక ప్రకటన ఉంటుందని మంత్రి వెల్లడించారు.
జీహెచ్‌ఎంసీకి రూ.400 కోట్లివ్వండి
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుకి అదనంగా చేపట్టాల్సిన కార్యక్రమాల కోసం మరో రూ.400 కోట్లను స్వచ్ఛ భారత్ మిషన్ లేదా మరే ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద అయినా కేటాయించాల్సిందిగా మంత్రి కేటీఆర్ మరో వినతిపత్రంలో కోరారు. దీంతోపాటు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం కేటాయించిన నిధుల్లో కేంద్రం నుంచి రావాల్సిన రూ.254 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిందిగా అభ్యర్థించారు.
శిక్షణ కార్యక్రమాలకు బేగంపేట ఎయిర్‌పోర్టు..
ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం యునైటెడ్ కింగ్‌డం (యూకే)లోని ప్రముఖ యూనివర్సిటీతో కలసి శిక్షణ కార్యక్రమాలు అందించేందుకు సిద్ధంగా ఉందని, ఇందుకోసం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ను ఉపయోగించుకునేలా వెసులుబాటు కల్పించాలని హర్దీప్‌సింగ్ పురిని మంత్రి కేటీఆర్ కోరారు.
ఇండ్రస్టియల్ కారిడార్ ఏర్పాటు చేయండి..
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల పారిశ్రామిక మంత్రుల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలపై మాట్లాడారు. దీంతో పాటు పారిశ్రామికీకరణ మరింత వేగంగా జరగాలంటే కేంద్రప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పలు సలహాలు, సూచనలు చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా, ఇతర పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక వర్గాలకు చేయూతనందిస్తున్న తీరు, దీంతో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారు. హైదరాబాద్ భౌగోళికంగా దేశానికి నడిరోడ్డున ఉందని, ఈ నేపథ్యంలో హైదరాబాద్–బెంగళూరు–చెన్నై ఇండ్రస్టియల్ కారిడార్ ఏర్పాటు చేసే విషయాన్ని కేంద్రప్రభుత్వం పరిశీలించాలని సూచించారు.